: యువరాజ్ సింగ్ ఫీనిక్స్ లాంటి వాడు...తిరిగి వస్తాడు: మాజీ సెలెక్టర్ సబా కరీమ్


టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ ఫీనిక్స్ పక్షిలాంటి వాడని టీమిండియా మాజీ కీపర్, సెలెక్టర్ సబాకరీం తెలిపాడు. యువీని ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక చేయని నేపథ్యంలో టీమిండియా సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సబాకరీం మాట్లాడుతూ, యువీ గురించి ఎవరెలా అనుకున్నా, అతను మాత్రం ఫీనిక్స్‌ పక్షిలాంటి వాడని అన్నారు. ఫీనిక్స్ పక్షి ఎలా అయితే చితాభస్మం నుంచి మళ్లీ పుడుతుందో యువీ కూడా అలాగే రాణించి విమర్శకుల నోటికి తాళం వేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఫిట్ నెస్ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించాడు. తాను ఛాంపియన్‌ ని అని యువీ ప్రతిసారీ నిరూపించాడని ఆయన గుర్తు చేశాడు. తాను సెలక్టర్‌ గా ఉన్న సమయంలో కూడా యువీ ఎంపిక కష్టమయ్యేదని ఆయన గుర్తు చేసుకున్నాడు. అయితే సెలెక్టర్ల నమ్మకాన్ని యువీ ఏనాడూ వమ్ము చేయలేదని తెలిపాడు. యువీ పునరాగమనం అంత సులువు కానప్పటికీ అసాధ్యం మాత్రం కాదని సబాకరీం తెలిపాడు. యువీ ఫిట్ నెస్ సాధించి, దేశవాళీల్లో ఆడితే జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. యువీ అనుభవం ఎప్పటికైనా అవసరమేనని ఆయన తెలిపాడు. 

  • Loading...

More Telugu News