: ఉత్తరకొరియాలో పరిస్థితి ఇలా ఉంటుంది... బీచ్ స్నానాలు కూడా ఆర్మీ అధికారుల కనుసన్నల్లోనే...!
నియంత పాలనలో ఉన్న ఉత్తరకొరియా గురించిన ఏ చిన్న వార్త తెలిసినా అది ఆసక్తికరంగానే ఉంటోంది. అక్కడ చోటుచేసుకునే సంఘటనలు, అక్కడి పరిస్థితులు, ప్రజల జీవనశైలి ఇలా అక్కడ జరిగే ప్రతీదీ ఆసక్తికరమే. అయితే అక్కడ ఎన్నో ఆంక్షలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఫోటోలు నిషిద్ధం. పర్యాటకులు కూడా ఫోటోలు తీసుకోవడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితుల్లో తారిక్ జైబి అనే ఫోటోగ్రాఫర్ చాలా ధైర్యం చేసి, కొన్ని ఫోటోలను రహస్యంగా తీశారు. చైనా సరిహద్దుల్లోని డాంగాంగ్ గుండా ఉత్తరకొరియాలో ప్రవేశించిన తారిక్ జైబి కొన్ని ఫోటోలు తీశాడు.
ఇందులో ఒక ఫోటోను ఆయన విడుదల చేశాడు. అందులో సముద్ర తీరంలో సైనికుల పహరా మధ్య కొంత మంది అమ్మాయిలు బీచ్ లో నడవడం కనిపించింది. ఉత్తరకొరియాలో అడుగడుగునా మిలటరీ పహరా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆ దేశంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే అలర్ట్ అయిపోతారని చెప్పారు. దీనికి సంబంధించిన మేసేజ్ లు అన్ని మిలటరీ కేంద్రాలకు వెళ్తాయని ఆయన తెలిపారు. బాహ్యప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు ఉత్తరకొరియాలో ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా, ఎవరైనా విదేశీయులు ఫోటోలు తీస్తూ దొరికిపోతే.. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన చెప్పారు.