: భారత్‌పై మరోమారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ భారత్‌పై మరోమారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. గోరక్షకుల దాడులు, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలను ప్రస్తావిస్తూ ఇండియాలో మతోన్మాదం, కులం పేరుతో దాడులు పెరిగిపోతున్నాయని, లైంగిక సంబంధాల విషయంలో ఆఫ్రికన్లపై దాడులు జరుగుతున్నాయంటూ ఇప్పటికే మొట్టికాయలు వేసిన ఐరాస.. తాజాగా రోహ్యంగా ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టాలని చూస్తుండడంపై అక్షింతలు వేసింది.
జెనీవాలో సోమవారం ప్రారంభమైన 36వ సెషన్ సందర్భంగా ఐరాసలో మానవ హక్కుల హైకమిషనర్ జీద్ రాడ్ అల్ హుస్సేన్ మాట్లాడుతూ.. రోహ్యంగా ముస్లింలపై దాడులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో వారిని భారత్ నుంచి పంపించాలని చూడడాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే ఈ విషయంలో భారత్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.
ప్రజలు తీవ్ర హింస ఎదుర్కొంటున్న ప్రాంతానికే తిరిగి వారిని పంపించాలనుకోవడం సరికాదని, జీద్ పేర్కొన్నారు. భారత్ పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికను ఆమోదించిందని, కాబట్టి ఒకవేళ రోహ్యింగా ముస్లింలను దేశం నుంచి పంపిస్తే దానిని ఉల్లంఘించినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రోహ్యింగా ముస్లింల విషయంలో ఆచితూచి అడుగు వేయాలని భారత్ నిర్ణయించింది. మయన్మార్‌లోని రోహ్యింగా ముస్లింలు ఎక్కువగా నివసించే రఖినె జిల్లాలో ఇటీవల హింస చెలరేగిన విషయం తెలిసిందే.