: కాంగ్రెస్ సేవాదళ్ బలోపేతం... ఇక క్షేత్రస్థాయిలో ఉద్యమం: ఏపీసీసీ
నిబద్ధతకు మారుపేరుగా తమ సేవాదళ్ పనిచేస్తోందని, కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు, ఏపీలో కాంగ్రెస్ సేవాదళ్‌ను బలోపేతం చేసేందుకు గాను పలు చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.భవాని నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు ఏపీసీసీ కార్యాలయంలో సేవాదళ్ ఏపీ ఇన్‌ఛార్జి కె.కె.పాండే ఆధ్వర్యంలో ఏపీ సేవాదళ్ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా భవాని నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర సేవాదళ్ కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్షించుకున్నామని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన ట్రైనింగ్ క్యాంప్స్ పై కూడా సమీక్ష జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఒక సోషల్ మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించినట్లు తెలిపారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడంపై ప్రతి జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. బీజేపీ, టీడీపీ ఎన్నికలలో తమ మానిఫెస్టోలో పొందుపర్చిన విషయాలను విస్మరిస్తున్నాయని, వీటిపై పోరాటం చేసేందుకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సేవాదళ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 13 జిల్లాల నుంచి ప్రతినిధులు, సేవాదళ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.