: పిల్లి మలం నుంచి కాఫీ గింజల తయారీ... ప్రపంచంలోనే అత్యధిక ధర గల కాఫీ!
ప్రపంచంలోనే అత్యధిక ధర గల సివిట్ కాఫీ లేదా లువాక్ కాఫీ గింజలను కర్ణాటకలోని కూర్గ్ రైతులు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం చిన్న మొత్తాల్లో ఉన్న వీటి ఉత్పత్తిని త్వరలోనే పెంచుతామని వారు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సివిట్ కాఫీ గింజలకు చాలా డిమాండ్ ఉంది. దీనికి ప్రధాన కారణం వాటిని సేకరించే విధానమే. సివిట్ అనే పిల్లి జాతికి చెందిన జంతువు మలం నుంచి ఈ కాఫీ గింజలను సేకరిస్తారు. నిశాచర జంతువైన సివిక్ ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని కొండ ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది.
ఇది కాఫీ కాయలను ఇష్టంగా తింటుంది. తిన్న కాఫీ కాయల్లో పై భాగాన్ని జీర్ణించుకోగల శక్తి మాత్రమే దీనికి ఉంది. జీర్ణక్రియలో భాగంగా మిగిలిపోయిన కాఫీ గింజలు మలం ద్వారా బయటకి వస్తాయి. ఆ మలాన్ని సేకరించి, శుద్ధి చేసి కాఫీ గింజలను బయటికి తీసి, అమ్ముతారు. కొండప్రాంతాల్లో సివిట్ పిల్లుల మలాన్ని వెతకడం, దాన్ని శుద్ధి చేయడం వంటి పనులు చాలా కష్టంతో కూడుకున్నవి. అందుకే ఈ కాఫీ గింజలకు ధర చాలా ఎక్కువ. గల్ఫ్, యూరప్ దేశాల్లో ఈ గింజలతో చేసిన కాఫీకి చాలా డిమాండ్ ఉంది. కేజీ గింజలు రూ. 20000 నుంచి 25000 ధర పలుకుతాయి.
కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కూర్గ్ కన్సాలిడేటెడ్ కమోడిటీస్ సంస్థ ఈ కాఫీ గింజల ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రారంభంలో 20 కేజీలు ఉత్పత్తి చేసి, గతేడాది 200 కేజీల వరకు ఈ కాఫీ గింజలను ఉత్పత్తి చేసినట్లు సహవ్యవస్థాపకుడు నరేంద్ర హెబ్బార్ తెలిపారు. ఈ అక్టోబర్ పంట ద్వారా టన్ను వరకు కాఫీ గింజలను ఉత్పత్తి చేసి, ఎగుమతి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఈ కాఫీ గింజలను `ఐన్మనే` పేరుతో కేజీకి రూ. 8000 చొప్పున అమ్ముతున్నట్లు నరేంద్ర చెప్పారు.