: గురుకుల పాఠశాలలో వన్యప్రాణుల మాంసం విక్రయాలు!
కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గురుకుల పాఠశాలలో జరుగుతోన్న మోసం తాజాగా వెలుగులోకొచ్చింది. ఆ పాఠశాల విద్యార్థులను వెంట తీసుకువెళ్లి మరీ వంటమాస్టర్, మరో నలుగురు వ్యక్తులు రాత్రి సమయంలో జింకలు, నెమళ్లు, కుందేళ్లను వేటాడుతున్నారు. తమతో వచ్చినందుకు గానూ విద్యార్థులకు డబ్బు కూడా ఇస్తున్నారు. అలా వేటాడిన ఆ అడవి జంతువుల మాంసాన్ని అదే పాఠశాల వేదికగా కిలో రూ.950కు అమ్ముకుంటున్నారు.
ఓ న్యూస్ ఛానెల్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులతో పాటు అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అక్కడవారికి కుందేళ్లు, నెమలి ఈకలు, ఓ వల కనిపించాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన పాఠశాలలో ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతుండడం కలకలం రేపుతోంది.