: గంజాయి రవాణా చేసే వారిలో అత్యధికులు వైసీపీ నేతలే ఉన్నారు: మంత్రి అయ్యన్నపాత్రుడు
గంజాయి రవాణాలో వైసీపీ నేతలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్టణం జిల్లాలోని ఏటిగైరంపేట నుంచి పాకలపాడు మీదుగా, తుని, వడ్డాది, బుచ్చయ్యపేటల మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నట్టు వివరించారు. పీడీ యాక్టు ప్రయోగిస్తేనే గంజాయి రవాణా నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కాగా, గంజాయి రవాణా జరుగుతున్న విషయం అన్ని విభాగాలకు తెలుసని, ముఖ్యంగా, పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలుసని అయ్యన్నపాత్రుడు ఇటీవల వ్యాఖ్యానించారు. గంజాయి రవాణాకు సహకరిస్తున్న పెద్దలపై పీడీ యాక్టు అమలు చేస్తే బాగుంటుందని అయ్యన్నపాత్రుడు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.