: అలా చేయడం కేవలం జూ.ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం!: హరీష్ శంకర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘జై లవకుశ’ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నిన్న విడుదల చేయగా అది యూ ట్యూబ్ దుమ్ము దులిపేస్తోంది. జై, లవ కుమార్, కుశ అంటూ మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తోన్న తీరు ఆయన అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తోంది. ఎన్టీఆర్ ఎటువంటి పాత్రలోనైనా మెప్పించగలడని మరోసారి నిరూపితమైందని సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
సినీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా రావణా అంటూ జై పాత్రలో కనిపించిన హావభావాలు ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేస్తున్నాయి. సినీ దర్శకుడు హరీశ్ శంకర్ ఈ ట్రైలర్ గురించి స్పందిస్తూ.. ‘ఒకే ట్రైలెర్ లో... నవ్వించడం, భయపడ్డం, భయపెట్టడం కేవలం @tarak9999కు మాత్రమే సాధ్యం!!’ అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. జై లవకుశ ఆల్ రెడీ విజయవంతం అయిపోయిందని కితాబిచ్చాడు.