: జాతీయ పెన్షన్ పథకం గరిష్ట వయోపరిమితి పెంపు... 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన
జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) గరిష్ట వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. `ఇప్పటివరకు ఎన్పీఎస్ పథకం 18 నుంచి 60 ఏళ్ల వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచడం వల్ల చాలా మందికి లాభం కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ నిర్ణయానికి అందరూ అంగీకరించారు` అని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ తెలిపారు. వయసు చెల్లిన నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలను సులభంగా అందించేందుకు పీఎఫ్ఆర్డీఏ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న 85 శాతం మంది ఉద్యోగులకు కూడా పెన్షన్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు.