: 'వాంటెడ్' అంటూ నేపాల్ సరిహద్దుల వద్ద హనీప్రీత్ కోసం పోస్టర్లు
అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కోసం పోలీసులు గాలిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నేపాల్‌కు పారిపోయిందని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆమె నేపాల్ పరారయిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని హర్యానా పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఆమె పారిపోయే అవకాశాలు ఉండడంతో ఆమెను పట్టుకునే క్రమంలో నేపాల్ సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 'వాంటెడ్' అంటూ ఆమె పోస్టర్లను అంటించారు.
ఈ విషయంపై హర్యానా పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ... నేపాల్ సరిహద్దులోని కపిల్‌వస్తు, మోహన, షోరత్‌గఢ్, డెబరు ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశామని చెప్పారు. ఇదే విషయమై ఉత్తర ప్రదేశ్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ... తమ రాష్ట్ర పోలీసులు కూడా నేపాల్ సరిహద్దులోని మహారాజ్ గంజ్, లఖింపూర్, బహ్రైచ్ ప్రాంతాల్లో అప్రమత్తమయ్యారని చెప్పారు. హనీప్రీత్ దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఉండడంతో ఈ నెల 1న ఆమెతో పాటు డేరా బాబా అనుచరుల్లో ఒకరైన ఆదిత్య ఇన్సాన్‌కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.