: ముంబయి వరుస పేలుళ్ళ నిందితుడి మృతి
సంచలనం సృష్టించిన 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ళ కేసులో నిందితుడిగా ఉన్న 85 ఏళ్ళ వ్యక్తి నేడు మరణించాడు. అతని పేరు ఇసాక్ మహ్మద్ రజ్వానే. రాయ్ గడ్ జిల్లా సంధేరి నివాసి. ఈ కేసులో ఇసాక్ కు తొలుత తీవ్రవాద వ్యతిరేక కోర్టు (టాడా) ఏడేళ్ళ జైలుశిక్ష విధించగా.. సుప్రీం కోర్టు ఇటీవలే దాన్ని జీవితఖైదుగా మార్చింది. మే17న ఇసాక్ సుప్రీం ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఐదేళ్ళ జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే.
తన చిత్రాలు పూర్తికానందున, లొంగిపోయేందుకు మరికొంత సమయం ఇవ్వాలని సంజయదత్ విన్నవించుకోవడంతో.. సుప్రీం అతనితోపాటు మరో ఐదుగురికి లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువిచ్చింది. ఈ ఐదుగురిలో ఇసాక్ కూడా ఒకడు. ముంబయి పేలుళ్ళ కు ముందు ఆయుధాల శిక్షణ ఇవ్వడంతోపాటు గ్రెనేడ్లు కలిగి ఉన్నాడన్న అభియోగంపై తీవ్రవాద వ్యతిరేక కోర్టు (టాడా) ఇసాక్ కు ఏడేళ్ళు జైలు శిక్ష విధించింది.