: చంద్రబాబుకు వయసు చూసైనా గౌరవం ఇవ్వు... జగన్ కు ఉండవల్లి సలహా!
రాజకీయాల్లో సీనియర్ అయిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడి వయసును చూసైనా ప్రతిపక్ష నేత జగన్ గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా ఇచ్చారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ గౌరవించడం నేర్చుకుంటే, ప్రజల మదిలో స్థానం సంపాదించుకోవచ్చని అన్నారు. చంద్రబాబు వైఖరి ఎంతో తప్పని, అయినప్పటికీ ఆయనతో పోలిస్తే చాలా తక్కువ వయసున్న జగన్ సంయమనం పాటిస్తేనే మంచిదని సూచించారు.
చంద్రబాబు వంటి పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎంను తాను ఇంతవరకూ చూడలేదన్నారు. డిసెంబర్ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం లేని పురుషోత్తపట్నం ప్రాజెక్టును హడావుడిగా పనులు పూర్తికాకుండానే ఆగస్టు 15న జాతికి అంకితం చేశారని విమర్శించారు. పోలవరం పనులు ఏడాదికి 3 శాతం మాత్రమే జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ఇంకో ఐదేళ్లయినా పూర్తి కాబోదని అన్నారు. ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు సర్కారు అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.