: మొబైల్ తయారీ కంపెనీ హెచ్‌టీసీని చేజిక్కించుకునే యోచనలో గూగుల్?
టెక్నాలజీ దిగ్గజం గూగుల్, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హెచ్‌టీసీని చేజిక్కించుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్‌లో హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లకు మంచి పేరు ఉన్నా గత రెండేళ్లుగా ఆ కంపెనీ నష్టాల ఊబిలో కొట్టుకుంటోంది. అంతేకాకుండా `పిక్సెల్` బ్రాండ్‌తో గూగుల్ తయారుచేస్తున్న స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఆ కంపెనీకి మొబైల్ తయారీ యూనిట్ అవసరమైంది. ఇందుకోసం ఏళ్ల తరబడి హెచ్‌టీసీతో ఉన్న భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్‌టీసీని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవడానికి గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, ఒప్పందానికి సంబంధించిన చర్చలు మాత్రం తుదిస్థాయికి చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా మోటరోలా కంపెనీని గూగుల్ హస్తగతం చేసుకుని, మళ్లీ దాన్ని లెనోవోకి కట్టబెట్టింది. మోటరోలాను స్వాధీనం చేసుకున్నాక దాని పేరు మీద ఉన్న పేటెంట్లన్నీ గూగుల్ పరమయ్యాయి. అదేవిధంగా హెచ్‌టీసీని కూడా పేటెంట్ల కోసమే తాత్కాలిక సమయానికి మాత్రమే హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.