: అనిత కుటుంబాన్ని పరామర్శించిన తమిళ స్టార్ హీరో విజయ్
నీట్‌కి వ్యతిరేకంగా తాను వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనిత కుటుంబాన్ని తమిళ స్టార్ హీరో విజయ్ పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి, పూరి గుడిసెలో అనిత తండ్రి, సోదరుణ్ని పరామర్శిస్తున్న ఫొటోలు ట్విట్టర్‌లో కనిపించాయి. శోకసంద్రంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి, సాధారణ వ్యక్తిలా వాళ్లతో విజయ్ కలిసిపోవడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఆయన నిజమైన నాయకుడిలా ప్రవర్తించారని పొగుడుతున్నారు.
విజయ్ కంటే ముందు నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కూడా అనిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. సాధారణంగా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలపై స్పందించడానికి విజయ్ పెద్దగా ఇష్టపడరు. అయితే మానవత్వ కోణం ఉన్న విషయాలకు మాత్రం తన మద్దతు తెలపడానికి విజయ్ ముందుంటాడు. గతంలో జల్లికట్టుకు సంబంధించిన వివాదంపై కూడా విజయ్ స్పందించారు. అంతేకాకుండా జల్లికట్లు నిరసనలు జరుగుతున్న మెరీనా బీచ్‌ను కూడా సందర్శించి వారికి మద్దతు పలికారు.