: ఇప్పుడు భయపడితే, జీవితాంతం భయపడాల్సి ఉంటుంది: కంగనా రనౌత్
ఇటీవల హృతిక్ రోషన్, ఆదిత్య పంచోలీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్, తన వ్యాఖ్యల వల్ల కెరీర్‌కు ముగింపు పలకాల్సిన అవసరం వస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే కంగనా మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించింది. కెరీర్ ముగిసిపోవడంపై తనకు ఎలాంటి బెంగ లేదని, దాని గురించి భయపడితే, జీవితమంతా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కంగనా చెప్పుకొచ్చింది.
`పదిహేనేళ్ల వయసులో నేను ఒంటరిగా సినిమా అవకాశాల కోసం వచ్చాను. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో గొప్ప సినిమాల్లో నటించి, మూడు జాతీయ అవార్డులు సాధించిన నాకు ఇంతకంటే ఏం కావాలి? కెరీర్ ఆగిపోవడం వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు. ఒకవేళ ఆగిపోయినా నేను వేరే రంగాల్లో రాణించగలననే నమ్మకం నాకు ఉంది` అని ఆమె అన్నారు. తాను మనాలీలో ఓ అందమైన ఇల్లు కట్టుకున్నానని, రచయితగా గానీ, దర్శకురాలిగా గానీ నిలదొక్కుకునే సత్తా తనకు ఉందని కంగనా చెప్పారు. అంతేకాకుండా బాలీవుడ్ తనకు ఏమీ ఇవ్వలేదని, తానే బాలీవుడ్‌కు ఇచ్చానని, తన కెరీర్ ముగిసిపోవడం వల్ల బాలీవుడ్‌కే నష్టమని ఆమె పేర్కొన్నారు.