: అందరికీ అందుబాటులో ఇంటర్నెట్... వచ్చే టెలికాం పాలసీలో ఇదే ప్రధాన ఎజెండా!
మార్చి 2018లో రానున్న కొత్త టెలికాం పాలసీలో భాగంగా దేశంలో ఉన్న 1.3 బిలియన్ల మందికి ఇంటర్నెట్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అలాగే మొబైల్ దిగుమతులకు కళ్లెం వేయడానికి దేశీయంగా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంటామని ఆయన చెప్పారు. డిజిటల్ ఇండియాలో భాగంగా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు, ఈ-పరిపాలనను మరింత అభివృద్ధి చేయడానికి రూ. 1.13 లక్షల కోట్లను ఖర్చు చేస్తామని మనోజ్ సిన్హా అన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీలపై టెలికాం పాలసీలో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తమ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడం వల్ల కాల్‌డ్రాప్‌ల సంఖ్య కూడా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జియో రాకతో టెలికాం మార్కెట్‌లో ఇంటర్నెట్ సదుపాయం అందరికీ అందుబాటులోకి వచ్చింది. పోటీని తట్టుకోవడానికి ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కూడా జియో తరహాలో భారీగా ఇంటర్నెట్ ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.