: సెల్ఫీ మోజులో చే'జారి'న ఫస్ట్ నైట్... కష్టపడి కాపాడారు!
తమ వంశాచారం ప్రకారం, తొలిరాత్రి జరుపుకునే ముందు కొండపై ఉన్న శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి రావాల్సిన జంట, సెల్ఫీ మోజులో కాలు జారి లోయలో పడిపోగా, పోలీసులు వారిని కష్టపడి రక్షించాల్సి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తమిళనాడు, నామక్కల్ జిల్లా కుమారపాళయానికి చెందిన ఇళంగోవన్ కు శుక్రవారం నాడు వైష్టవి అనే యువతితో వివాహం అయింది. వీరి కుటుంబ సంప్రదాయం ప్రకారం, ఊరాచ్చికోట సమీపంలో ఉన్న వేదగిరి కొండకు కాలినడకన వెళ్లి శివాలయంలో పూజలు చేసి దిగొచ్చిన తరువాతనే శోభన ముహూర్తం. ఈ నేపథ్యంలో కొండకు వెళ్లిన కొత్త జంట, కిందకు దిగివస్తూ, 50 అడుగుల లోయ వద్ద సెల్ఫీ దిగాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కాలుజారి ఇద్దరూ లోయలో పడిపోయారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వారిని ప్రాణాలతో రక్షించారు.