: తెలంగాణలో కోమట్లనే అంటారు.. వారిని నేను విమర్శించలేదు: కంచె ఐలయ్య వివరణ
తెలంగాణలో కోమటోళ్లను కోమట్లనే అంటారని ప్రముఖ సామాజికవేత్త, రచయిత కంచె ఐలయ్య వివరణ ఇచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను ఎవరినీ విమర్శించలేదని అన్నారు. ఎవరినీ విమర్శించాల్సిన అవసరం తనకు లేదని ఆయన తెలిపారు. ఈ పుస్తకం కులాల సంస్కృతిని వివరించే సందర్భంగా రాసిందని ఆయన చెప్పారు. తాను తెలుగులో రాసిన పుస్తకంలో 'కోమట్లు' అని పేర్కొన్నానని, ఇంగ్లీష్ పుస్తకంలో 'బనియా' అని పేర్కొన్నానని ఆయన తెలిపారు.
ఆమధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ, 'గాంధీ చతుర్బనియా' (తెలివైన వైశ్యుడు) అని అన్నారని తెలిపారు. హిందూ ధర్మ శాస్త్రాలను ఉదహరిస్తూ, గ్రామాల్లో వ్యాపారం కోమట్లు మాత్రమే చెయ్యాలన్న నిబంధన తెచ్చారని ఆయన తెలిపారు. ఈ విధానం కారణంగా గ్రామీణ వ్యాపార వవస్థ మొత్తం వారి చేతుల్లోనే ఉండిపోయిందని ఆయన చెప్పారు. అంటరానితనం జడలు విప్పడంలో వారు కూడా భాగమేనని ఆయన చెప్పారు. తనకు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను అరికట్టడంలో ఆర్యవైశ్యులు భాగం కావాలని ఆయన సూచించారు. అలాగే గ్రామీణ వ్యాపారంలో దళితులు, ఇతర సామాజిక వర్గాలకు భాగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.