: ఆవు పాలతో యమా డేంజర్.. చిన్నారులకు ఆ పాలు పట్టొద్దు: నిపుణుల హెచ్చరిక
ఏడాది లోపున్న చిన్నారులకు ఆవు పాలు పట్టిస్తున్నారా? ఇక నుంచి ఆ పని మాత్రం చేయొద్దని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆవు పాలతో మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఆవు పాలు చిన్నారుల్లో శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, అలర్జీలకు కారణమవడంతోపాటు రక్తహీనతకు గురిచేస్తాయని చెబుతున్నారు.
పాలు లేని తల్లులు ఆవు పాలకు బదులుగా ప్రత్యామ్నాయ పోషక పదార్థాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఆవు పాలను జీర్ణించుకునే శక్తి చిన్నారులకు ఉండదని, ఫలితంగా ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుందని అంటున్నారు నిపుణులు. ఈ మేరకు ర్యాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్ (ఆర్ఎస్ఓసీ) లో ఈ విషయం తేటతెల్లమైందని పోషకాహార నిపుణుడు నందన్ జోషి తెలిపారు. తల్లి పాలు లభించని చిన్నారుల్లో 42 శాతం మంది ఆవు, లేదంటే ఇతర జంతువుల పాలను ఆహారంగా తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పాలు చర్మ వ్యాధులు, వాంతులు, డయేరియా, కడుపునొప్పి, కోరింత దగ్గు తదితర రుగ్మతలకు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.