: క్యూబా వీధుల్లోకి సముద్ర జలాలు... ఇర్మా ఎఫెక్ట్!
ఇర్మా హరికేన్ అమెరికాలో తీరం దాటిన సంగతి తెలిసిందే. అమెరికాను చేరే క్రమంలో క్యూబాలో కూడా ఇర్మా తుపాను విధ్వంసం సృష్టించింది. 250 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి వేలాది నివాస స్థలాలు దెబ్బతిన్నాయి. తూర్పు క్యూబా,ఉత్తర క్యూబాలో తీరం వెంబడి ప్రాంతమంతా నీట మునిగింది. హవానాలోని వీధుల్లోకి సముద్రం చొచ్చుకొచ్చింది. దీంతో వీధుల్లో సముద్రపు నీరు ప్రవహిస్తోంది.
మరోవైపు రహదారులు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శాంటాక్లారా పట్టణంలో 39 భవనాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ముప్పు ఇంకా తొలగలేదని, ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇర్మా బాధితులను క్యూబన్ సైన్యం స్కూళ్లు, ప్రభుత్వ భవనాలకు తరలించి, రక్షణ కల్పిస్తోంది. ఇర్మా కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖాధికారి తెలిపారు.