: నాన్నా.. ఈ జన్మకు అభిమానులతో ఉండిపోతాను: జూనియర్ ఎన్టీఆర్
‘నాన్నా.. ఈ జన్మకు అభిమానులతో ఉండిపోతాను. మరో జన్మలో మీ రుణం తీర్చుకుంటాను’ అంటూ తండ్రి హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగంతో అన్నారు. ‘జై లవ కుశ’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా చూసి ఎంత బాగా తీశారని అభిమానులు అనుకోవాలి... తల్లిదండ్రులూ అనుకోవాలి' అన్నారు.
'ఈ చిత్రం కథ విన్న తర్వాత అద్భుతంగా ఉందని బాబీకి చెప్పాను. ఆ తర్వాత ఈ కథ గురించి ఇద్దరు వ్యక్తులతో పంచుకున్నాను. వాళ్లిద్దరూ కూడా ‘కథ చాలా బాగుంది’ అని చెప్పారు. అయితే.. వాళ్లిద్దరి పేర్లు ఇప్పుడే చెప్పను. ఈ సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ల పేర్లు చెబుతాను. ఈ సినిమా మీకు నచ్చుతుందని.. బాగుంటుందని.. హిట్టవుతుందని నా నమ్మకం...ఈ చిత్రం తప్పకుండా మన గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందనే నమ్మకం నాకుంది...
ఇక ‘జై లవ కుశ’ సినిమా కేవలం ‘జై’ ఒక్కడి సినిమా కాదండి. ఈ చిత్రం జై, లవ, కుశ.. ఈ మూడింట్లో ఏ ఒక్క పేరు పోయినా కరెక్టవదు. ఈ చిత్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ అంకితం. ఈ చిత్రం చూసి అన్నదమ్ములందరు కూడా ఇన్ స్పైర్ అవుతారని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా’ అని జూనియర్ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
కాగా, అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రంలోని ఓ డైలాగ్.. ‘ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాల.. ఈ రావణుడ్ని సంపాలంటే సముద్రమంత ద ద దా.. దా..దైర్యముండాల.. ఉందా?’ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో చప్పట్లు మార్మోగిపోయాయి.