: జేఎన్యూ విద్యార్థి ఎన్నికల్లో ఏబీవీపీకి ఘోర పరాజయం... క్లీన్ స్వీప్ చేసిన ఐక్య వామపక్ష కూటమి


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ ఘోరంగా ఓడిపోయింది. ఐక్య వామపక్ష కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ సాధించారు. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి పోటీపడిన గీతా కుమారి, ఏబీవీపీకి చెందిన నిధి త్రిపాఠిని 464 ఓట్ల తేడాతో ఓడించింది. ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ ఏబీవీపీ అభ్యర్థి దుర్గేష్ కుమార్ కు 1028 ఓట్లు రాగా, ఏఐఎస్ఏ అభ్యర్థి సిమోన్ జోయా ఖాన్ కు 1,876 ఓట్లు వచ్చాయని ఎలక్షన్ ప్యానల్ అధికారులు తెలిపారు.

జనరల్ సెక్రటరీ పోస్టుకు లెఫ్ట్ అభ్యర్థి దుగ్గిరాల శ్రీకృష్ణ పోటీపడి 2,082 ఓట్లు తెచ్చుకోగా, అతనికి సుదూరంగా ఏబీవీపీ అభ్యర్థి నికుంజ్ మక్వానా 975 ఓట్లతో నిలిచాడు. జాయింట్ సెక్రటరీ పదవిని కూడా లెఫ్ట్ గెలుచుకుంది. ఈ పదవికి పోటీ పడ్డ శుభాన్షు సింగ్ కు 1,755 ఓట్లు రాగా, సమీప ఏబీవీపీ అభ్యర్థి పంకజ్ కేసరికి 920 ఓట్లు వచ్చాయి. ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై ఇంకా నమ్మకం ఉందని, అందువల్లే తమ అభ్యర్థులు ఘన విజయం సాధించారని ఈ సందర్భంగా గీతా కుమారి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News