: నరేంద్ర మోదీపై అభిమానం చూపిస్తే గెంటేసిన భర్త... యూపీ మహిళ కాపురంలో వింత చిచ్చు!
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై అభిమానం చూపిన ఓ ముస్లిం మహిళ కాపురంలో చిచ్చు రాజుకుంది. వారి బొమ్మలను గీసినందుకు భర్త గెంటేసి మరో వివాహానికి సిద్ధపడగా, ఇప్పుడామె తన కాపురం నిలపాలని పోలీసులు చుట్టూ తిరుగుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బలియా ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల మహిళకు, రెండేళ్ల క్రితం బసరిక్ పూర్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఆమె కాపురం సజావుగానే సాగుతుండేది.
అయితే, యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తరువాత, ఆమె అభిమానంతో మోదీ, యోగిల చిత్రాలను గీసి వాటిని భర్తకు, ఇతర కుటుంబీకులకు చూపినప్పటి నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులతో కలసి దాడికి దిగిన భర్త, ఆమెను ఇంటి నుంచి తరిమేశాడు. పుట్టింట్లో ఉన్న ఆమెకు భర్త మరో వివాహానికి సిద్ధమైనాడన్న విషయం తెలియడంతో అత్తారింటికి వెళ్లగా, మరోసారి దాడి చేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, వారు భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ ఇదే తరహాలో ఓ జంట మోదీపై వాదులాడుకుని విడిపోయిన సంగతి తెలిసిందే.