: భగవంతుడు తెలుగులో కోట్లాది మంది అభిమానులను ఇచ్చాడు... ఈ జన్మకు ఇది చాలు!: ప్రిన్స్ మహేశ్ బాబు


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్' ఆడియో విడుదల వేడుక నిన్న రాత్రి చెన్నైలో వైభవంగా జరిగింది. చలన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన 18 సంవత్సరాల తరువాత తొలిసారిగా తమిళంలో పరిచయం అవుతున్న మహేశ్, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా కనిపించాడు. తెలుగు, తమిళం పాటలను ఒకేసారి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మీడియా ఆయనను 'చెన్నైలో పుట్టి పెరిగిన మీరు, తమిళ సినిమాలు చేయాలని గతంలో ఎందుకు అనుకోలేదు?' అని ప్రశ్నించగా, "భగవంతుడు తెలుగులో కోట్లాది మంది అభిమానులను ఇచ్చాడు. అక్కడ నేను ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను సంపాదించుకున్నా. ఈ జన్మకు ఇది చాలు. తమిళంలో సినిమాలు చేయడం లేదనే కొరత లేదు. ఇప్పుడీ చిత్రంతో 18 ఏళ్ల తర్వాత మళ్లీ నేను నటుడిగా పరిచయమవుతున్నట్టుంది. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాషల్లో సినిమా చేయడం మామూలు విషయం కాదు. దర్శక, నిర్మాతలు ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమా చేశారు" అని అన్నాడు.

విజయ్ నటించిన 'తుపాకి' చూసిన వెంటనే దాన్ని రీమేక్ చేయాలని అనుకున్నానని, కానీ కుదరలేదని, అందులో ఆయన చెప్పిన 'ఐయామ్ వెయిటింగ్' అన్న డైలాగ్ తనకెంతో ఇష్టమని చెప్పాడు. స్పైడర్ లో పోషించిన పాత్ర తన మనసుకు ఎంతో దగ్గరైందని అన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు విశాల్ మాట్లాడుతూ, మహేశ్ కు కోలీవుడ్ లోకి స్వాగతం పలికేందుకే తాను ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చానని, అభిమానులతో పాటు తాను కూడా ఆసక్తిగా చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News