: మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ 13 ఏళ్ల ముంబయి బాలిక!
ముంబయికి చెందిన ఓ బాలిక (13) పై ఆమె తండ్రి వ్యాపార భాగస్వామి అఘాయిత్యానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు తమ కూతురి గర్భస్రావానికి అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అయితే, కోర్టు అనుమతి ఇచ్చిన రెండు రోజుల తరువాత ఆమెకు వైద్యులు సిజేరియన్ చేశారు. దీంతో ఆమె చిన్నతనంలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది.
దీనిపై వైద్యులు మాట్లాడుతూ.. బాలిక వయస్సు 13 ఏళ్లే కావడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సిజేరియన్ పద్ధతిని ఎంచుకున్నామని, శిశువు తక్కువ బరువుతో (1.8కిలోలు) పుట్టాడని చెప్పారు. ప్రస్తుతం ఆ తల్లీకొడుకులకి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆ శిశువును ఆ బాలిక కుటుంబ సభ్యులు తమతో పాటే పెంచుకుంటారా? అనే విషయంపై వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.