: కర్ణాటక ముఖ్యమంత్రితోను, కేంద్ర ప్రభుత్వంతోను మాట్లాడతా.. ఆందోళన చెందకండి: కన్నడిగుల దాడులపై చంద్రబాబు
కర్ణాటకలో జాతీయ ఉద్యోగ పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై కన్నడిగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన ధైర్యం చెప్పారు. ఈ అంశంపై కర్ణాటక చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడాలని సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్రను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడతానని చెప్పారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ దాడి అంశంపై చర్చ జరిగింది. ఈ విషయాన్ని మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డిలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు, కర్ణాటక సీఎస్ తో సతీష్ చంద్ర ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు.