: ఆరేళ్ల చిన్నారికి చేయూతనందించిన బొండా ఉమ!
విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ గొప్ప మనసును చాటుకున్నారు. మెదడు సమస్యతో బాధ పడుతూ ఆక్సిజన్ తీసుకోలేకపోతున్న ఆరేళ్ల చిన్నారి కృతికకు ఆయన చేయూత అందించారు. కృతిక శ్వాసతీసుకోలేక ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుండటంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను విజయవాడలోని సిటీ న్యూరో హాస్పిటల్ లో చూపించారు.
నరాల బలహీనత వల్ల ఆమెకు తరచుగా ఆక్సిజన్ అందడం లేదని... ఆపరేషన్ చేయడం కుదరదని ఈ సందర్భంగా డాక్టర్లు వారికి చెప్పారు. అయితే ఖరీదైన ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆటో డ్రైవర్ గా బతుకీడుస్తున్న కృతిక తండ్రిది వైద్యం చేయించలేని దయనీయ స్థితి. దీంతో, వారు బొండా ఉమను కలిసి, తమ గోడును వెళ్లదీసుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వారికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాదు, చిన్నారికి అవసరమైన మందులన్నింటినీ రాసి ఇస్తే ప్రభుత్వ ఆసుపత్రికి ఇండెంట్ పెట్టి, అందిస్తానని హామీ ఇచ్చారు. చిన్నారికి స్వీట్ బాక్స్ అందించి... ఆమె తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.