: ప్రభుత్వ టీచర్లు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు... ఇది న్యాయమా?: తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని
హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీచర్లకు ఆగ్రహాన్ని తెప్పించడంతో ఆందోళన చేశారు. చివరకు ఆయనతో క్షమాపణలు చెప్పించుకుని ఆందోళన విరమించారు. దాని వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 75 మంది టీచర్లను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిరుపేదల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుంటే, ఆ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటుకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.
విచ్చల విడిగా సెలవులు తీసుకుంటూ స్కూళ్ల మూసివేతకు కారణమవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం? అని ఆయన నిలదీశారు. ఈ దుస్థితికి చరమగీతం పాడి, ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సూచించారు. ఈ విధానం కేవలం టీచర్లకు మాత్రమే పరిమితం కాదని, ఇతర విభాగాల ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆయన విమర్శించారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటే సమాజం ఎలా మారుతుందని ఆయన అడిగారు. దీంతో టీచర్లు ఆందోళన చేశారు. నాయిని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నినదించారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పడంతో వివాదం సమసిపోయింది.