: పౌరసత్వం రద్దుపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే చెన్నమనేని!
తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31 నుంచి పౌరసత్వం రద్దు నిర్ణయం అమల్లో ఉంటుందని కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయం చెల్లదని ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. భారత పౌరసత్వ చట్టం - 1955లోని సెక్షన్ 10(1) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లను చేర్చారు.
తనకు భారత పౌరసత్వం ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల్లో మాత్రమే అభ్యంతరాలు చెప్పాలని భారత పౌరసత్వ చట్టం చెబుతోందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో తనపై పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తనపై చాలా ఆలస్యంగా ఫిర్యాదు చేసినా దానిపై కేంద్ర హోం శాఖ స్పందించిందని ఆ పిటిషన్ లో తప్పుబట్టారు. అంతేకాకుండా, కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.