: ప్రభాస్ రాజమౌళితో ఏమనేవాడో తెలుసా?: రానా
‘బాహుబలి’ రెండు భాగాలతో అంతర్జాతీయ స్టార్ లు గా మారిన ప్రభాస్, రానా మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రానా గత స్మృతుల్లోకి వెళ్లాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ, ‘జీవితంలో అంతవరకు తాను కలవని ఓ మంచి వ్యక్తి ప్రభాస్ అని, తను చాలా సింపుల్ గా ఉంటాడని అన్నాడు. ప్రభాస్ కి ఉన్నతమైన లక్ష్యాలు, ఆశయాలు లేవని, అయితే సినిమానే ప్రేమిస్తూ, దాని కోసం ఏదైనా చేసే వ్యక్తి అని అన్నాడు.
ఒక నటుడు తన జీవితంలోని 5-6 ఏళ్లను ఒక సినిమాకు ఇవ్వడం నమ్మలేని విషయమని చెప్పాడు. అలాంటిది ప్రభాస్ సులభంగా ఇచ్చేశాడని అన్నాడు. అంతే కాకుండా సెట్ లో ఒక్కోసారి నిరాశకు గురైతే... ప్రభాస్ వచ్చి... రాజమౌళితో ‘డార్లింగ్, ఎలాంటి సినిమా చేస్తున్నామో తెలుసా? ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నాం డార్లింగ్’ అంటూ ఉత్సాహం నింపేవాడని చెప్పాడు. సినిమాకు రాజమౌళి, ప్రభాస్ మూల స్తంభాలుగా నిలబడ్డారని రానా చెప్పాడు. స్ఫూర్తి రగిలించే ఇలాంటి మాటలను ప్రభాస్ సింపుల్ గా చెప్పేసేవాడని, ఆ సినిమాను ప్రభాస్ నిజయతీగా నమ్మాడని రానా తెలిపాడు.