: రావత్ కోరుకున్నది జరిగితే ఇండియా తట్టుకోగలదా?... పెను నష్టం తప్పదని హెచ్చరించిన చైనా
ఇండియాకు రెండు పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి వుందని, ఒకేదఫా చైనా, పాకిస్థాన్ లతో యుద్ధం చేయాల్సి రావచ్చని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ఆయన నోరు ఎంతో చేటు చేయనుందని చైనా, భారత్ ల మధ్య వాతావరణం చెడిపోనుందని చైనా అధికార మీడియా 'గ్లోబల్ టైమ్స్' వ్యాఖ్యానించింది. తన సంపాదకీయంలో "రావత్ అహంకార పూరిత వ్యాఖ్యలతో భారత ఇమేజ్ దెబ్బతింటోంది. బ్రిక్స్ సమావేశాల్లో ద్వైపాక్షిక బంధంపై పాజిటివ్ వ్యాఖ్యలు చేసి ఆపై ఇలాంటి మాటలు అనడం దారుణం. ఆయన పెద్ద నోరు బీజింగ్, న్యూడిల్లీల మధ్య మంట పుట్టిస్తోంది" అని అభిప్రాయపడింది.
చైనా పాకిస్థాన్ లు ఒకేసారి భారత్ పై పడితే ఆ దేశం తట్టుకోలేదని పేర్కొంది. అదే జరిగితే ఇండియా తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరించింది. ప్రస్తుతం తమ దేశ పరిస్థితి ఎలా వుందన్న కనీస విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భారత సైన్యాధికారులు మాట్లాడుతున్నారని ఆరోపించింది. ఇటువంటి మాటలు మాట్లాడేముందు చైనా సైనిక బలంతో ఓసారి పోల్చుకున్నారా? అని ప్రశ్నించింది. సరిహద్దుల విషయంలో భారత్ తో గొడవలు వద్దని చైనీయులు భావిస్తున్నారని, అయితే, జనరల్ రావత్ చేసిన కామెంట్లు చైనీయులకు తప్పుడు సంకేతాలు పంపాయని పేర్కొంది.