: ఏపీ, టీఎస్ లో అసెంబ్లీ సెగ్మెంట్ల పెంపు ఉండబోదు: తేల్చి చెప్పిన భన్వర్ లాల్
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండబోదని తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ స్పష్టం చేశారు. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, ఏపీలోని అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెరగాల్సి వున్నాయని, అయితే, 2002లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 వరకూ పునర్విభజనకు అవకాశం లేదని ఆయన అన్నారు. ఓటు హక్కు లేని పౌరులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.