: ఐటీ రంగంలోని లోపాలు బయటపెడతామంటున్న టెక్కీలు!
గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా వివిధ ఐటీ రంగ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. వివిధ కారణాలు చూపించి, అకారణంగా విధుల నుంచి తప్పిస్తున్నాయి. పింక్ స్లిప్ లు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే విధుల ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు తాజా పరిస్థితుల నేపథ్యంలో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఐటీ నిపుణుల ఫోరం నేడు మీడియా సమావేశం నిర్వహించనుంది.
ఈ సమావేశంలో ఐటీ రంగంలోని అంతర్గత అంశాలను బహిర్గతం చేయనున్నామని తెలిపింది. సుమారు 100 మంది ఐటీ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఐటీ కంపెనీల యాజమాన్యాలు కట్టుకధలుగా కొట్టిపడేసే భయంకరమైన వాస్తవాలను వెల్లడించనున్నామని ఈ ఫోరం తెలిపింది.
ఐటీ ఇండస్ట్రీలో అభూతకల్పనలు, అసత్యాలు, ఉద్యోగుల అక్రమ తొలగింపులు, ప్యాకేజీ చెల్లింపులు తదితర అంశాలపై వాస్తవాలు వెల్లడించనున్నామని వారు తెలిపారు. కాగా, ఈ ఫోరం ఐటీ ఉద్యోగుల సంక్షేమం కోసం పోరాడుతోంది. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టు, లేబర్ కమీషన్లలో వందలాది పిటిషన్లు వేసింది. ఈ క్రమంలో ఐటీ నిపుణులు ఎలాంటి బాంబు బద్దలు చేయనున్నారన్న ఆసక్తి అందర్లోనూ రేగుతోంది.