: 'ఐ లవ్ యూ' అని పదేపదే ఆహ్వానించింది... వెళితే శాపనార్థాలు పెట్టింది: రాధేమాపై సంచలన ఆరోపణలు చేసిన సురీందర్ మిట్టల్
తనను తాను దేవతగా ప్రకటించుకుని, ఆపై పొట్టి దుస్తులు, అశ్లీల నృత్యాలు చేసి వివాదాస్పదరాలైన సుఖ్వీందర్ కౌర్ అలియాస్ రాధేమాపై విశ్వ హిందూ పరిషత్ మాజీ సభ్యుడు సురీందర్ మిట్టల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను లోబరచుకోవాలని ఆమె పదే పదే ప్రయత్నించిందని చెప్పారు. ఎన్నోమార్లు 'ఐ లవ్ యూ' చెప్పిందని, నిజమేనని తాను వెళితే శాపనార్థాలు పెట్టిందని చెప్పాడు.
"ఇది రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘటన. మీడియాలోనూ వచ్చింది. ఆమె నిర్వాకాలపై నేను కేసు వేశాను. చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరాను. బాబాలమని, స్వాములమని తప్పుడు గుర్తింపుతో తిరిగే వారందరినీ శిక్షించాల్సిందే" అని వార్తా సంస్థ 'ఏఎన్ఐ'తో మాట్లాడుతూ చెప్పారు. కాగా, రాధేమాపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన కపుర్తలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సురీందర్ మిట్టల్ ఆరోపణలపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి దయా చౌదరి, విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేస్తూ, ఈలోగా సమాధానం ఇవ్వాలని జిల్లా సీనియర్ ఎస్పీని ఆదేశించారు.