: 'ఆ బాస్టర్డ్ ని చంపాలని మాత్రమే ఆలోచించు'.. సహచరుడికి జవాను ఉత్తేజపూరిత లేఖ.. కార్గిల్ యుద్ధం నాటి సంఘటన!
అది 1999వ సంవత్సరం. కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ పన్నిన పన్నాగాన్ని భారత సైన్యం భగ్నం చేసిన ఏడాది. ఆ సమయంలో దేశ సరిహద్దుల్లో కాపలాగా ఉన్న జవాన్లు చూపిన ధైర్య సాహసాలు నిరుపమానం. అప్పట్లో సైనికులు రాసిన లేఖలను రచయిత్రి దీక్షా ద్వివేది సమీకరించి ఓ పుస్తక రూపంలో వెలువరించారు. వాటిల్లో ఓ లేఖ ఉత్తేజపూరితంగా ఉంది. రాజ్ పుటానా రైఫిల్స్ లో లెఫ్టినెంట్ గా ఉన్న ప్రవీణ్ తోమర్ (అప్పట్లో 23 ఏళ్లు), తన సహచర జవాను గగన్ కు రాసిన లేఖ ఇది. 1999, జూన్ 25న రాసిన ఈ లేఖలో తానెదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ, శత్రువులను ఎలా మట్టుబెట్టాలో ప్రవీణ్ వెల్లడించారు.
"డియర్ గగన్, నీ లేఖ అంది పక్షం రోజులైంది. ఇక్కడున్న పరిస్థితులు, ఎదురైన అనుభవాలు తిరిగి నీకు జవాబు రాయడాన్ని కాస్తంత ఆలస్యం చేశాయి. నువ్వు రాసిన లేఖకు ధన్యవాదాలు. నువ్వు ద్రాస్ సెక్టారులోని టోలోలింగ్ హిల్ పేరు వినే ఉంటావు. మేము దాన్ని ఈ నెల 12, 13 రాత్రి అధీనంలోకి తెచ్చుకున్నాం. మా ప్లాటూన్ కు నేనే నేతృత్వం వహించాను. మాకన్నా ముందు 18 గ్రనేడియర్ టోలోలింగ్ ను వశం చేసుకోవడానికి వెళ్లింది. వారిలో 20 మంది అమరులయ్యారు. వారిలోనే మేజర్ అధికారి కూడా ఉన్నారు.
వారు విజయం సాధించడంలో విఫలం కాగా, ఈ టాస్క్ మాకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో టోలోలింగ్ ను వశపరచుకోవడమే మా లక్ష్యం. మా దళానికీ తీవ్ర నష్టం కలిగింది. ప్రతి ఒక్కరూ చనిపోవడమో లేదా తీవ్రంగా గాయపడటమో జరిగింది. దళానికి నేతృత్వం వహిస్తున్న నాకు గాయాలు కాకపోవడం అద్భుతమే. కేవలం ఐదు మీటర్ల దూరంలోనే శత్రువుల తుపాకులు పేలినా వాటి నుంచి తప్పించుకున్నాను. ఓ ల్యాండ్ మైన్ మీద కాలుపెడితే అది పేలి ఎగిరి పడ్డాను. నా కాలు పోయిందని అనిపించింది. కానీ అదృష్టవశాత్తూ ఏమీ కాలేదు. నా దళంలో మేజర్ వివేక్ గుప్తా సహా 8 మంది అమరులయ్యారు"
"యుద్ధానికి వెళ్లడమంటేనే అదో భయానక అనుభూతి. ఓ దళాన్ని నడిపిస్తూ, తన వెనుక వస్తున్న వారిని ఉత్తేజపరుస్తూ, వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి లక్ష్యాన్ని చేరుకునేలా ఉత్సాహపరచడం తేలికైన విషయమేమీ కాదు. నీ తండ్రి వయసులో ఉన్న జవాన్లకు నువ్వు ఆదర్శం కావాలి. ఈ యుద్ధంలో వారు మరణించవచ్చని నీకు తెలుసు. నేను బతికున్నానని మాత్రం సంతోషించు. భయాలపై యుద్ధం చేసి, అనుమానాలను పక్కన బెట్టి, ఎదురుగా ఉన్న బాస్టర్డ్ ను తుదముట్టించాలన్న ఒక్క ఆలోచన మాత్రమే చెయ్యి. విజయం అదే సిద్ధిస్తుంది"
"ఈ యుద్ధంలో భాగంగా ఒక రోజు పాటు మాకు ఎటువంటి ఆహారము, నీరు అందలేదు. మూత్రంలో రక్తం కూడా పడింది. కానీ లక్ష్య సాధనపై మాత్రం వెనుకంజ వేయలేదు. చివరికి అనుకున్నది సాధించాం. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు. మాపై అభినందనలు వెల్లువెత్తాయి. నా కళ్లలో మాత్రం మా ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుపెట్టిన వారు మెదిలారు. ఈ యుద్ధంలో నువ్వు కూడా గట్టిగా పోరాడుతున్నావని భావిస్తున్నా. నాకో లేఖ రాసేందుకు కొంత సమయం కేటాయించు. ఈ సమయంలో నేను నా కుటుంబానికి లేఖ రాయలేదు. రాసి వారిని ఆందోళనలోకి నెట్టలేను. దయచేసి నా ఒంటరి తనాన్ని దూరం చేసేలా వేగంగా ఓ లేఖ రాయి. యువర్స్ ప్రవీణ్" అంటూ లేఖను ముగించాడు.