: వైసీపీకి కొత్త టార్గెట్ లు పెట్టిన ప్రశాంత్ కిషోర్?

నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల ఫలితాలపై తన బృందంతో నివేదికలను తెప్పించుకుని, లోతుగా విశ్లేషించారు. అనంతరం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై జగన్ కు నివేదిక అందించినట్టు సమాచారం. ఈ నివేదికలో వైసీపీ అధినాయకత్వానికి పీకే కొత్త సూచనలు చేశారని, కొత్త టార్గెట్ లను నిర్ణయించారని తెలుస్తోంది.

పార్టీ అంతర్గత నిర్మాణం సరిగా లేదని నివేదికలో పీకే తెలిపారు. పార్టీకి ఇదే పెద్ద మైనస్ పాయింట్ అని స్పష్టం చేశారు. వెంటనే సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని... అయితే నెల రోజుల్లోనే అది పూర్తి కావాలంటే... మిస్డ్ కాల్ విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు. దీనికే... సభ్యత్వ నమోదు అనే పేరు కాకుండా... వైయస్ఆర్ కుటుంబం అనే పేరును పెట్టుకున్నారు. మిస్డ్ కాల్ ఇచ్చిన ప్రతి వ్యక్తిని వైసీపీ సభ్యుడిగా గుర్తిస్తారు. కనీసం కోటి మిస్డ్ కాల్స్ ను వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. జగన్ పాదయాత్ర చేపట్టబోయే లోపల కోటి మందిని వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.

మరోవైపు ఒక్కో బూత్ నుంచి 10 మందిని ఎంపిక చేసి, వారికి హైదరాబాదులో శిక్షణ ఇప్పించి, క్షేత్రస్థాయికి పంపించనున్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాల వల్ల జరిగే లబ్ధిని, చంద్రబాబు పాలనలోని లోపాలను వీరు ప్రజలకు చెబుతారు. మరోవైపు, పాదయాత్ర సమయంలో జగన్ కోర్టు వాయిదాలకు వెళ్లకుండా మరోసారి కోర్టును ఆశ్రయించే దిశగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పీకేనే కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.

More Telugu News