: అరెస్టు చేస్తే రెచ్చిపోండంటూ అల్లరి మూకలకు 5 కోట్లు ఇచ్చిన డేరా బాబా...సాక్ష్యాలు సంపాదించిన పోలీసులు!
డేరా బాబాను రేప్ కేసులో దోషి గా నిర్ధారించిన తరువాత, శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానాలో భారీ విధ్వంసం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. సుమారు 200 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయే వాస్తవాలను వెలుగుతీశారు. ఈ అల్లర్లన్నీ ముందస్తు కుట్రతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినవేనని నిర్ధారించారు. ఈ విధ్వంసానికి డేరా సచ్చా సౌధా నుంచి అల్లరిమూకలకు 5 కోట్ల రూపాయలు అందినట్లుగా పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు.
ఈ మేరకు బాబా అనుచరులు ప్రమోద్ కుమార్, రాజీవ్ సింగ్, ఆదిత్య, సురేంద్రలు పలు విషయాలను పోలీసులకు వెల్లడించారు. బాబాను కోర్టు దోషిగా నిర్ధారించి, శిక్ష విధించిన పక్షంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి వ్యూహరచన చేశామని వారు తెలిపారు. బాబా ఆదేశాల మేరకే తాము ఈ పని చేశామని, ఇందుకు పది రోజుల ముందే అల్లరిమూకలకు పెట్రోలు, కారం పొడి, హాకీ స్టిక్కులను అందజేశామని వారు తెలిపారు. అల్లర్లలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారికి నష్టపరిహారం కూడా అందజేస్తామని, విధ్వంసం భారీ ఎత్తున ఉండాలని చెప్పామని వారు తెలిపారు. పంచకులలోని డేరా చీఫ్ చామ్ కౌర్ సింగ్ చేతులు మీదుగా అల్లరిమూకలకు 5 కోట్ల రూపాయలు అందజేసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో పరారీలో ఉన్న అతనిపై రాజద్రోహం కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.