: గౌరీ లంకేష్ లాగే సాగరికా ఘోష్ ను కూడా చంపేయాలి... ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్టు!
కర్ణాటకలో లంకేష్ పత్రికా ఎడిటర్ గౌరీ లంకేశ్ ను హతమార్చిన సంగతి తెలిసిందే. ఆమెను హతమార్చినట్టే ప్రముఖ జర్నలిస్టు సాగరికా ఘోష్ ను కూడా హత్య చేయాలని హెచ్చరిస్తూ ఢిల్లీకి చెందిన వ్యక్తి ఫేస్ బుక్ లో చేసిన పోస్టు పెను కలకలం రేపింది. ఆ పోస్టులో ఏమన్నారంటే...‘పాత్రికేయులుగా, సామాజిక కార్యకర్తలుగా ముసుగులు ధరించి జాతివ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకునే వారినందరినీ చంపేయాలి. అలాంటివారికి గౌరీ లంకేశ్ హత్య హెచ్చరికగా నిలవాలి. ఇది ఇక్కడితో ఆగకూడదు. శోభా డే, అరుంధతీ రాయ్, సాగరికా ఘోష్, కవితా క్రిష్ణన్, షెహ్లా రషీద్ లాంటి వారినందరినీ చంపేయాలి. జాతి వ్యతిరేక, మోసకారులైన రాజకీయ నేతలనూ హతమార్చాలి. ఇందుకోసం ఓ హిట్ లిస్ట్ తయారుచేయాలి’ అని పేర్కొన్నాడు.
ఈ ఫేస్ బుక్ పేజ్ విక్రమాదిత్య రాణా పేరుతో ఉన్న ప్రొఫైల్ నుంచి పోస్ట్ అయింది. దీనిని సాగరిక ఘోష్ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇంతకీ విక్రమాదిత్య రాణా ఎవరని ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.