: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. అక్టోబర్ లో డీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. దసరా కానుక కింద అక్టోబర్ లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అంతేకాదు, వచ్చే ఏడాది ఆగస్టులోగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్వయంగా వెల్లడించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా ప్రయత్నిస్తోందని అన్నారు.
రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే కేజీ టూ పీజీ అనే కొత్త విధానాన్ని తీసుకురావాలనే ఆలోచన చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వాలు వాటి ఇష్టానుసారం కళాశాలలు మంజూరు చేశాయని, వాటికి నిధులు, నియామకాలు.. లేకపోవడంతో నాణ్యమైన విద్య అందకుండా పోయిందని విమర్శించారు.