: ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ!
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం రద్దయింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ముఖేష్ మిట్టల్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రమేశ్ భారత పౌరసత్వం పొందారని ఎస్ కె టాండన్ జ్యుడిషియల్ కమిటీ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ.. ఇక్కడ పొందుతున్న ప్రయోజనాలను ఉపసంహరించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
కాగా, తాజా ఉత్తర్వులపై రాజకీయ ప్రత్యర్థి బీజేపీ నేత ఆది శ్రీనివాస్ స్పందిస్తూ, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందడం సిగ్గుచేటని, రమేశ్ తన ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, చెన్నమనేని భారత పౌరసత్వం చెల్లదని, ఆయన జర్మనీ పౌరుడేనని తేల్చి చెప్పిన నేపథ్యంలో రమేశ్ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోనున్నారు.