: ట్విట్టర్లో ట్రెండ్‌గా మారిన `#బ్లాక్నరేంద్రమోదీ`.... కారణం గౌరీ లంకేశ్ హత్య!
ట్విట్టర్లో భారత ప్రధాని నరేంద్రమోదీని అనుసరిస్తున్న వాళ్లందరూ ఒక్కొక్కరిగా ఆయన్ని బ్లాక్ చేస్తున్నారు. అలా చేస్తూ చేస్తూ `#బ్లాక్నరేంద్రమోదీ`ని ట్రెండ్‌గా మారుస్తున్నారు. దీనంతటికీ కారణం జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యగా తెలుస్తోంది. ఆమె హత్యకు గురైన తర్వాత నిఖిల్ దధీచీ అనే వ్యక్తి ఆమెకు తగిన శాస్తి జరిగిందని, దీంతో మిగతా కుక్కలు కూడా నోరుమూసుకుంటాయని బూతులు ఉపయోగిస్తూ ట్వీట్ పెట్టాడు.
ఈ వ్యక్తిని అనుసరిస్తున్న వారి జాబితాలో చాలా మంది రాజకీయనేతలతో పాటు ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని కనిపెట్టిన సామాజిక వాది డా. రాకేశ్ పారిఖ్, పాత్రికేయుల హత్యకు నరేంద్రమోదీ మద్దతు పలుకుతున్నాడని, నిఖిల్ దధీచీ అకౌంట్‌ను ప్రధాని అన్‌ఫాలో చేసే వరకు ప్రధాని అకౌంట్‌ను ఎవ్వరూ అనుసరించవద్దని ప్రచారం మొదలుపెట్టాడు. దీంతో పాటే `#బ్లాక్నరేంద్రమోదీ`ని ఉపయోగించాడు. దీంతో చాలా మంది నెటిజన్లు ప్రధాని మోదీ అకౌంట్‌ను అన్‌ఫాలో చేసి, బ్లాక్ చేయడం ప్రారంభినట్లు తెలుస్తోంది.