: పోలీసులు వస్తున్నారని తెలుసుకుని.. పెళ్లి మండపం నుంచి పారిపోయిన వధూవరులు, కుటుంబ సభ్యులు!
పెళ్లి జరగడానికి మరికొంత సమయం ఉందనగా పెళ్లికొడుకు, పెళ్లికూతురు, వారి బంధువులు పెళ్లి మండపం నుంచి పారిపోయిన ఘటన తమిళనాడులోని స్వామిమలైలో చోటు చేసుకుంది. పెళ్లికొడుకు అంతకు ముందే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ అమ్మాయి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే, దుర్గాదేవి (27) అనే యువతి కోవిలాచ్చేరికి చెందిన ఆటో మెకానిక్ బాబురాజన్ (33) ను మూడేళ్ల క్రితం వేలాంగన్నిలో ప్రేమ పెళ్లి చేసుకుంది. అనంతరం వారు కోవిలాచ్చేరిలో నివసించారు.
ప్రస్తుతం దుర్గాదేవి నాలుగు నెలల గర్భిణిగా ఉంది. మరోవైపు తల్లిదండ్రులు చూసిన మరో యువతిని కూడా పెళ్లి చేసుకునేందుకు బాబురాజన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో దుర్గాదేవి మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు బాబురాజన్‌ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. అయితే, తాను పెళ్లి చేసుకోవాలనుకుంటోంటే పోలీసులు అడ్డుపడుతున్నారని బాబురావు ఏమీ తెలియని అమాయకుడిగా కోర్టును ఆశ్రయించాడు. నిజం తెలుసుకున్న కోర్టు ఆయన వేసిన పిటిషన్‌ను స్వీకరించలేదు.
కాగా, నిన్న స్వామిమల ఆలయంలో బాబురాజన్.. తన తల్లిదండ్రులు చూసిన వలంగమాన్ అనే యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. వివాహానికి బంధుమిత్రులను ఆహ్వానించి పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాబురావు భార్య దుర్గాదేవి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో ఆమె న్యాయవాదిని తీసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. దీంతో కుంభకోణంలోని స్థానిక పోలీసులు పెళ్లి మండపానికి వెళ్లారు. అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న వధూవరులు, బంధువులు అంతా కలిసి అక్కడి నుంచి పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.