: చైనా-ఉత్తర కొరియా సరిహద్దులో పెరుగుతున్న రేడియేషన్.... చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి!
ఉత్తర కొరియా చేపడుతున్న అణుపరీక్షల కారణంగా చైనా - ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతాల్లో రేడియేషన్ స్థాయుల్లో మార్పులు కనిపిస్తున్నాయని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడి ప్రాంతాల్లో రేడియేషన్ నెమ్మదిగా పెరుగుతోందని వారు వెల్లడించారు. అయితే ఉత్తర కొరియా అణుపరీక్షల ద్వారా పర్యావరణంలో ఎలాంటి మార్పు కనిపించలేదని చైనా ప్రభుత్వం అధికారికంగా చేసిన ప్రకటనకు విరుద్ధంగా శాస్త్రవేత్తల నివేదిక ఉండటం గమనార్హం. ఇరు దేశాల సరిహద్దుకు దగ్గరగా ఉన్న చాంగ్‌బాయ్ ప్రాంతంలో సరాసరిగా గంటకు 104.9 నానోగ్రేలు ఉండాల్సిన రేడియేషన్ స్థాయి, ఆదివారం అణుపరీక్ష జరిగిన వెంటనే 108.5 నానోగ్రేలకు పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కానీ గురువారం నాటికి అక్కడి రేడియేషన్ స్థాయి 110.7 - 112.5 నానోగ్రేలకు చేరుకుందని వారు చెప్పారు. దీన్ని బట్టి రేడియేషన్ స్థాయి నెమ్మదిగా పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలని, ఒకవేళ ఈ స్థాయి మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వం ఆలోచించాలని సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. సరిహద్దు వద్ద గల ఆంటూ, యాన్‌బియాన్ ప్రాంతాల్లోనూ రేడియేషన్ పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఉన్న రేడియేషన్ స్థాయి వల్ల మానవులకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు పేర్కొన్నారు.