: అవసరానికి మాత్రమే సెల్ ఫోన్ వాడండి.. లేకపోతే రోగాలు వస్తాయి: సీఎం చంద్రబాబు
సెల్ ఫోన్ ని అవసరానికి మాత్రమే ఉపయోగించాలి తప్పా, ఇరవై నాలుగు గంటలూ అదే పనిలో ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని, రోగాలు వస్తాయని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర నిర్మించే ప్రతిష్టాత్మక వైద్య సంస్థ అమెరికన్ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, జపాన్, యూరప్ దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిందని, జపాన్ లో అయితే రోబోలతో పనులు చేయించుకుంటున్నారని, అటువంటి పరిస్థితి మనదేశంలో రాకూడదని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.
ఆలోచనా విధానం మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పిన చంద్రబాబు, ఏపీ రాజధాని అమరావతికి త్వరలో 13 మెడికల్ కళాశాలలు రానున్నట్టు చెప్పారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, వైద్య విద్యార్థులను గ్రామాలకు పంపి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసర చికిత్స కోసం అడ్వాన్స్ మెడికల్ సపోర్టు వాహనాలు తీసుకొచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఒకప్పుడు గుండె ఆపరేషన్ కోసం నందమూరి తారకరామారావు అమెరికాకు వెళ్లాల్సి వచ్చిందని, కానీ, అమెరికా వాళ్లు కూడా గుండె ఆపరేషన్ కోసం ఇండియాకు రావొచ్చని అన్నారు. కాగా, ఇబ్రహీంపట్నం దగ్గర 20 ఎకరాల్లో అమరావతి - అమెరికన్ ఆసుపత్రి నిర్మించనున్నారు. మూడు దశల్లో రూ.600 కోట్ల పెట్టుబడితో 700 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 2019 మార్చి నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేయనున్నారు.