: పోర్న్ వీడియోలు దొరికాయని భర్తను జైలుకు పంపిన ఆస్ట్రేలియా మహిళా ఎంపీ!
చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను కలిగి ఉన్న భర్తను జైలుకు పంపించారో మహిళా ఎంపీ. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. విక్టోరియా రాష్ట్ర ఎంపీ అయిన రాచెల్ జెంకిన్స్ చెప్పిన విషయాలు ఇప్పుడు ఆస్ట్రేలియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక రోజు తమ ఇంట్లో భారీ ఎత్తున చైల్డ్ పోర్న్ వీడియోల కలెక్షన్ దొరికిందని... దీంతో తన కుమారుడితో కలసి వెళ్లి తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. తన భర్త చైల్డ్ పోర్నోగ్రఫీకి బానిస అయ్యాడనే అనుమానం తనకు ఎన్నడూ రాలేదని... ఇంట్లో వీడియోలు, ఫొటోలు దొరకడంతో తన జీవితం తలకిందులైందనే ఫీలింగ్ కలిగిందని చెప్పారు. అత్యంత బాధను కలిగించే ఫొటోలను ఆ కలెక్షన్ లో చూశానని తెలిపారు.
పోర్న్ కలెక్షన్ దొరికిన రోజునే తాను ఆ ఇంటిని వదిలిపెట్టానని... తన వస్తువులు తీసుకోవడానికి కూడా మళ్లీ ఆ ఇంటికి వెళ్లలేదని రాచెల్ చెప్పారు. ప్రస్తుతం తాను విడిగానే ఉంటున్నానని... కేసు విచారణకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆ విషయం గురించి ఇన్నాళ్లు బయటకు చెప్పలేదని అన్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వల్ల నిరుపేద, బలహీన, నిస్సహాయ వర్గాలకు చెందిన పిల్లలు లైంగిక హింసను అనుభవిస్తున్నారని చెప్పారు.