: ఈ ఏడాది ఒక్కరికే సీటు.. 99 సీట్లు ఖాళీ!: సేవాభావం వున్న విద్యార్థులకే ప్రవేశాలు ఇస్తామంటున్న వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ!


తమిళనాడులోని వేలూరులో ఉన్న క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసి)కి ఘన చరిత్ర ఉంది. వందేళ్ల చరిత్ర గల ఈ మెడికల్ కాలేజీలో వంద సీట్లున్నాయి. రోమన్ క్యాథలిక్ మిషనరీకి చెందిన ఈ కాలేజీలో కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఒక జవాను కుమారుడిని మాత్రమే జాయిన్ చేసుకుంది. నీట్ ద్వారా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని జాయిన్ చేసుకునేందుకు ససేమిరా అంటోంది. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ఆసుపత్రులు నడుపుతున్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చదవడాన్ని విద్యార్థులు గొప్పగా భావిస్తారు. ఈ కళాశాల పూర్తిగా విరాళాలతో నడుస్తుంది. ఇక్కడ మెడికల్ కాలేజీ వార్షిక ఫీజు 3,000 రూపాయలంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ప్రభుత్వ ఫీజుల కంటే ఇక్కడి ఫీజులు ఎంతో తక్కువ. ఈ కాలేజీ ప్రతి ఏటా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి, మెరుగైన మార్కులు వచ్చిన, ఇంటర్వూలో సేవాభావం కనబర్చిన విద్యార్థులను మాత్రమే తీసుకుంటుంది.

 ఇందులో విద్యాభ్యాసం చేసిన వారు ఈ సంస్థకు చెందిన గ్రామీణ ఆసుపత్రుల్లో రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రజలతో ఆప్యాయంగా మెలగాల్సి ఉంటుంది. అలా ఉండాలంటే వారికి ఆ స్థితి గతులు తెలిసి ఉండాలి... మార్కులు ఎక్కువ వచ్చిన ప్రతివారికి సేవ చెయ్యాలన్న ఆలోచన ఉండదన్న ఉద్దేశంతోనే నీట్ ఆధారంగా అడ్మిషన్లు జరపడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మిగిలిన 99 సీట్లను ఖాళీగానే ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. నీట్ ను అంగీకరించినా... తమ కళాశాలలో జాయిన్ చేసుకునే విద్యార్థులను ఎంపిక చేసుకునే హక్కు తమకు ఉందని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. దీనిపై కళాశాల యాజమాన్యం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు అక్టోబర్ లో తీర్పు ఇవ్వనుంది. అప్పుడు సుప్రీంకోర్టు అనుమతిస్తే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెబుతోంది. తమ కళాశాలలో అన్నీ పారదర్శకంగా ఉంటాయని, ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా తెలిపామని ఆ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. 

  • Loading...

More Telugu News