: పరిమళించిన మానవత్వం... మూడేళ్ల చిన్నారికి 14 నెలల పసికందు జీవనదానం
భారతావనిలో మానవత్వం మరోమారు పరిమళించింది. బ్రెయిన్ డెడ్ అయి, బతికే అవకాశం ఎంతమాత్రమూ లేని 14 నెలల చిన్నారి బాలుడి అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో ఆ బాలుడు అమరజీవి అయ్యాడు. సూరత్ కు చెందిన బాలుడు ఆడుకుంటూ కిందపడి తీవ్రంగా గాయపడగా, న్యూ సూరత్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించగా, అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తేల్చిచెప్పారు.
ఓ ఎన్జీవో సంస్థ కౌన్సెలింగ్ ఇవ్వడంతో చిన్నారి అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఆపై చిన్నారి అవయవాలను సేకరించిన వైద్యులు కిడ్నీలను అహ్మదాబాద్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు పంపారు. గుండెను సేకరించి, నవీ ముంబైలో గుండె వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారికి అమర్చారు. ఇందుకోసం బాలుడి గుండెను ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించి, విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. తన అవయవదానంతో చిరంజీవిగా నిలిచిన ఆ బాలుడు ఇప్పుడు ఇండియాలో అత్యంత పిన్న వయస్కుడైన డోనర్ గా ప్రతి ఒక్కరి హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు.