: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న మహేశ్, రాంచరణ్... ఇక పోటీ బాలయ్య, పవన్ మధ్యే!
నలుగురు ప్రధాన హీరోల సినిమాలతో 2018 సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ పోటీ ఉంటుందని భావించగా, ఇప్పుడా పోటీ బాలకృష్ణ, పవన్ కల్యాణ్ మధ్యే ఉండనుందని సమాచారం. తొలుత సంక్రాంతికి ప్లాన్ చేసిన రాంచరణ్ 'రంగస్థలం' డిసెంబర్ లోనే విడుదలకు ముస్తాబవుతుండగా, అదే సంక్రాంతిని టార్గెట్ చేసిన మహేశ్ బాబు 'భరత్ అను నేను' చిత్రం ఆ సమయానికి విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. యూపీలోని చారిత్రక ప్రదేశాల్లో చిత్రం షూటింగ్ జరగాల్సి వుండగా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు ఇవ్వకపోవడంతో సినిమా ఆలస్యమవుతుందని ఇండస్ట్రీ నిపుణులు తేల్చి చెబుతున్నారు.
ఇక ఈ రెండు చిత్రాలూ తప్పుకోవడంతో సంక్రాంతి హీరోగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న బాలకృష్ణ, 102వ చిత్రం బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల కాంబినేషన్ పవన్ - త్రివిక్రమ్ జోడీ తయారు చేస్తున్న చిత్రం జనవరి 10న విడుదలకు ముస్తాబవుతోంది. ఇక పవన్ తొలిసారిగా బాలకృష్ణతో పోటీ పడుతూ సంక్రాంతి రేసులో నిలుస్తుండటం, రెండింటిపైనా భారీ అంచనాలు ఉండటంతో, ఎవరు విజేత అవుతారన్న విషయం తెలియాలంటే, మరో నాలుగు నెలలు ఆగక తప్పదు.