: కీలక నిర్ణయం తీసుకోనున్న మోదీ... దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల మూసివేతకు రెడీ!
సొంత వాహనంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే... టోల్ టాక్స్ కట్టాలి. గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లాలన్నా టోల్ చెల్లించాలి. ఇక దూరప్రయాణమైతే ఈ టోల్ భారం వేలల్లో ఉంటుంది. ఉదాహరణకు చెన్నై నుంచి కన్యాకుమారికి పోవాలంటే ఓ కారుకి రూ. 1500 కట్టుకోవాలి. దేశవ్యాప్తంగా వాహన చోదకులను ఇలా నిలువు దోపిడీ చేస్తున్న టోల్ ప్లాజాల మూసివేతకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని కీలకాంశాల్లో ఒకటైన టోల్ ప్లాజాల మూసివేతకు ఎన్డీయే సర్కారు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం దేశంలో 434 టోల్ ప్లాజాలు నడుస్తుండగా, కారుకో రేటు, లారీకో రేటు, బస్సుకో రేటు, పెద్ద వాహనాలకు మరో రేటు చొప్పున వసూలు చేస్తారన్న సంగతి తెలిసిందే. పలు టోల్ ప్లాజాల వద్ద తరచూ డబ్బు వసూలు విషయమై గొడవలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇక తన మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీగా ఉన్న టోల్ ప్లాజాల మూసివేతపై అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకూ పట్టించుకోని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, ప్రస్తుతం ఆ ఆలోచన చేస్తున్నట్టు నేషనల్ హైవేస్ కు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.