: అన్నాడీఎంకే కీలక నేత, దినకరన్ వర్గం ముఖ్యుడు ధనశేఖరన్ అరెస్ట్
అన్నాడీఎంకే ముఖ్య నేత, టీటీవీ దినకరన్ వర్గంలో కీలకుడైన ధనశేఖరన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాలు విక్రయించిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తర చెన్నై ప్రాంతంలో నిషేధిత మాదక ద్రవ్యాలను విక్రయిస్తూ, కొందరు పట్టుబడగా, విచారణ అనంతరం వారి వెనకుంది ధనశేఖరనేనని తేల్చారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు తండయారుపేట, వాషర్ మెన్ పేట, కొరుక్కుపేట, రాయపురం, కాశిమేడు ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు, 300 కిలోల జర్దా, 50 కిలోల మావాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో కొంతకాలం పనిచేసిన ధనశేఖరన్, ఆపై అన్నాడీఎంకేలోకి వచ్చి శశికళ అనుచరుడిగా ఉన్నారు. ఇక మత్తుపదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చి, ఎవరికి విక్రయించారన్న విషయమై ఆయన్ను విచారిస్తున్నట్టు సమాచారం.